ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న పివి సింధు..

టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. సింధు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదాశీర్వచనాన్నిచ్చారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ ఈఓ భ్రమరాంబ సింధుకు అందించారు. అనంతరం పివి సింధు మీడియాతో మాట్లాడుతూ.. టోర్నమెంట్‌కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని, కాంస్య పతకాన్ని సాధించి తిరిగి అమ్మవారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందని హర్షాన్ని వ్యక్తపరిచారు. ఇంకా ఆడవల్సిన టోర్నమెంట్లు ఉన్నాయని, 2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడతానని, ఈసారి కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని సింధు ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.