అరాచక శక్తులకు అడ్డాగా చిన రాఘవయ్య పార్కు: ఆళ్ళహరి

*ఆహ్లాదాన్ని పంచాల్సిన పార్కులో ఆరాచకశక్తుల హల్ చల్
*కొన్నేళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా పార్కు

రెండు దశాబ్దాల క్రితం శ్రీనివాసరావుతోట పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన పట్టంశెట్టి చిన రాఘవయ్య పార్కు నేడు ఆరాచకాశక్తులకు అడ్డాగా మారిందని జనసేన పార్టీ నాయకులు ఆళ్ళహరి నగరపాలక సంస్థ కమీషనర్ నిశాంత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. బుధవారం శ్రీనివాసరావుతోటకు విచ్చేసిన కమీషనర్ నిశాంత్ కుమార్ ను కలిసిన ఆళ్ళ హరి రాఘవయ్య పార్కు దుస్థితిపై వివరిస్తూ పార్కును పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి పార్కులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను కమీషనర్ కు విన్నవించారు. రాత్రయితే చాలు ఎక్కడెక్కడి నుంచో కుర్రాళ్ళు గంజాయి , మద్యం తాగుతూ స్థానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎవరన్నా ఇదేమిటని ప్రశ్నిస్తే వారిపై భౌతిక దాడులకు సైతం దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కులో ఒక్క విద్యుత్ లైట్ కూడా లేకపోవటంతో ఆ ప్రాంతం మొత్తం చీకటిగా ఉండటంతో యువకుల ఆగడాలకు అంతులేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కమీషనర్ అనురాధ నైట్ వాచ్ మెన్ ను ఏర్పాటు చేశారని అయితే అతన్ని యువకులు తీవ్రంగా కొట్టి మాన్పించారని కమీషనర్ కి తెలిపారు. వెంటనే ఈ పార్కుకి నైట్ వాచ్ మెన్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పార్కు విషయమై ఇప్పటికే అర్బన్ యస్పీ హఫీజ్ కి ఫిర్యాదు చేశామన్నారు. ఎంతోమందికి ఆహ్లాదాన్ని పంచేలా ముఖ్యంగా మహిళలు వాకింగ్ చేసుకునేలా ట్రాక్ ని ఏర్పాటు చేసి, పార్కు సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు కమీషనర్ ను కోరారు. ఈ సందర్భంగా కమీషనర్ నిశాంత్ కుమార్ స్పందిస్తూ రాఘవయ్య పార్కు అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, ఆకతాయిల ఆగడాలను అరికట్టేలా యస్పతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.