‘పరువు నష్టం’ కేసులో కోర్టుకు రాహుల్

నరేంద్ర మోదీ ఇంటి పేరుకు సంబంధించి దాఖలైన పరువు నష్టం దావా కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యారు. కేసులో తన వివరణనిచ్చారు. ప్రధాని ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మోదీ కమ్యూనిటీని మొత్తం అవమానించేలా ఉన్నాయంటూ 2019లో బీజేపీ సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ పిటిషన్ వేశారు. తాజాగా ఆ కేసు విచారణ సందర్భంగా జూన్ 24న కోర్టు ముందు హాజరు కావాలంటూ రాహుల్ గాంధీని సూరత్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో ఆయన ఇవ్వాళ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు వచ్చే ముందు.. ‘భయపడితే బతకలేవు’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంతకుముందు 2019 అక్టోబర్ లో కూడా కోర్టుకు వచ్చిన ఆయన.. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని వివరణ ఇచ్చారు. కాగా, 2019 ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. వాళ్లందరి ఇంటి పేరు మోదీనే చూశారా! దొంగలందరి ఇంటి పేరు ఒకటే ఎలా ఉందో!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.