ప్రేమానురాగాల సంగమం ఈ రక్షాబంధన్

భారతీయ కుటుంబాలు ఆత్మీయం, అనురాగాలతో పెనవేసుకుని ఉంటాయి. విదేశీయులు సైతం మన కుటుంబ వ్యవస్థను చూసి అబ్బురపడడం మనం చూస్తూనే ఉంటాము. శ్రావణ పౌర్ణిమ కోసం మన ఆడపడుచులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అంటువంటి మన కుటుంబాలలో అన్నా చెల్లెళ్ళు,అక్కా తమ్ముళ్లు జన్మ బంధంతో రక్షాబంధన్ జరుపుకుంటున్న ఈ ఆనందవేళ సోదర సోదరీమణులు అందరికీ ప్రేమపూర్వక రాఖి శుభాకాంక్షలు… అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల ప్రేమానురాగాలు అపురూపమైనవి..వెల కట్టలేనివి. అవి అనిర్వచనీయమైనవి. అక్కగాని చెల్లెలుగాని లేని సందర్భాలలో ఎవరో ఒక ఆడ బిడ్డతో మనం రాఖీ కట్టించుకుంటాము. అదేవిధంగా తమ్ముడుగాని, అన్నగాని లేని పక్షంలో మనసుకు దగ్గరయిన ఆత్మీయుడికి మన భారతీయ ఆడపడుచులు రాఖీ కడతారు. సోదరి ప్రేమను వ్యక్తం చేస్తారు.కష్టసుఖాలలో సోదరుడు తోడుంటాడని ఒక భరోసా. ఇటువంటి మన సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దుస్సంఘటనలు మనసును కలచివేస్తాయి. ఆవేశంతో హృదయం భారంగా మారుతుంది. ఈ శుభదినాన యావన్మందికి నాదో విన్నపం.. ఏ ఆడపిల్లయినా సరే మన ఇంటి ఆడపడుచుగా చూడండి. వారు నిర్భయంగా జీవించే మార్గాన్ని సుగమం చేయండి. ఈ శ్రావణ పూర్ణిమ భారతీయులందరికీ శుభాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేనాని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *