వీరమహిళలే జనసేన పార్టీకి అండ

* పాలనాపరమైన పాలసీలపై అవగాహన కలిగిన మహిళలు రాజకీయాల్లోకి రావాలి
* సాధారణ కుటుంబాల నుంచే అలాంటి వాళ్లు వస్తారు
* మాతృభూమి రక్షణ కోసం ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన పోరాటం మనకు స్ఫూర్తి
* లక్ష్మీబాయి స్ఫూర్తిని వీరమహిళలు పుణికి పుచ్చుకోవాలి
* జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు
* పుష్పాంజలి ఘటించి, వీరమహిళలను ఉద్దేశించి మాట్లాడిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

నుదుట కుంకుమ పోయినా ఫర్వా లేదు… ధైర్యం కోల్పోవద్దని చెప్పి ఖడ్గ తిక్కనను యుద్ధానికి పంపిన ఆయన భార్య, తల్లి వంటి మహిళలే జనసేన పార్టీకి స్ఫూర్తిదాయకమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంతటి రాక్షసుడినైనా శక్తి స్వరూపిణి అంతం చేయగలదని, అందుకే జనసేన మహిళా విభాగానికి వీర మహిళ విభాగమని నామకరణం చేశామని చెప్పారు. వీర మహిళలే జనసేన పార్టికీ అండదండ అన్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి వేడుకలు జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వీరమహిళలను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “సామ్రాజ్య రక్షణ కోసం ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి. మాతృభూమి కోసం బిడ్డను వీపు మీద కట్టుకొని గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేయడం నాలో స్ఫూర్తి రగిలించింది. పరాయి పాలకుల అణచివేతపై తిరుగుబాటు జరిపి ప్రాణాలర్పించిన ధీరవనిత ఆమె.
* రాజకీయాలు అంటే నోరేసుకొని పడిపోవడం కాదు
రాజకీయ నాయకులు అంటే గొంతేసుకొని పడిపోవడం, నోటికొచ్చినట్లు తిట్టడం కాదు. చదువుకున్న వాళ్లు.. పాలనాపరమైన, విధానపరమైన పాలసీలపై అవగాహన కలిగిన వాళ్లు.. పోరాటం చేయగల సత్తా ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలి. అలాంటి వాళ్లు సగటు కుటుంబాల నుంచే వస్తారు. రాజకీయాల్లో బాధ్యత కలిగిన మహిళా నాయకులు ఉండాలని కోరుకుంటాను. అప్పట్లో రమిజాబీ రేప్ కేసు ఎంతో సంచలనం సృష్టించింది. మేము స్కూల్ కు వెళ్తుంటే దారిలో గోడలపై రమిజాబీకి న్యాయం చేయాలని రాసుండేవి. రమిజాబీకి న్యాయం జరగాలని అందరూ ముక్త కంఠంతో కోరారు. ఇప్పుడు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఒకట్రెండు మానభంగాలు జరిగినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆ మైండ్ సెట్ ను మనం మార్చాలి. సుగాలీ ప్రీతిపై అఘాయిత్యం చేసి హత్య చేశారు. దివ్యాంగురాలైన ఆమె తల్లి న్యాయం కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అయినా సమాజంలో చలనం లేకుండా పోయింది. ఆడబిడ్డల సంరక్షణ చాలా ముఖ్యమైనది” అన్నారు.