RCB vs KKR: రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయo

ఐపీఎల్‌-13లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 82 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో విరాట్ సేనకు ఇది ఐదో విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (34 పరుగులు; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (1), టామ్‌ బాంటన్‌ (8), నితీశ్‌ రాణా (9), ఇయాన్‌ మోర్గాన్‌ (8), ఆండ్రూ రస్సెల్‌ (16) అందరూ బెంగళూరు బౌలర్ల ధాటికి క్రీజులో నిలవలేక ఇలా స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ బాటపట్టారు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (2/20), క్రిస్‌ మోరీస్‌ (2/17) చెరో రెండు వికెట్లు తీసుకోగా, నవదీప్ షైని, మొహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ఇసురు ఉడనలకు ఒక్కో వికెట్ లభించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ విషయానికొస్తే.. ఓపెనర్స్ అరోన్‌ ఫించ్‌ (47 పరుగులు; 37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌ ), దేవదత్‌ పడిక్కల్‌ (32 పరుగులు; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్‌ ( 73 పరుగులు నాటౌట్‌; 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు)తో మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ( 33 పరుగులు నాటౌట్: 28 బంతుల్లో 1 ఫోర్‌) రాబట్టాడు. దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగలిగింది.