రాయల్స్ మరో విక్టరీ

కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌  అద్భుతమైన విజయాన్ని సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ కింగ్స్‌ విసిరిన 224 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్‌ సాధించి మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. స్టీవ్‌ స్మిత్‌(50; 27 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్ ‌(85; 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), తెవాతియా( 53; 31 బంతుల్లో 7 సిక్స్‌లు)లు రాజస్తాన్‌ విజయంలో కీలక  పాత్ర పోషించారు. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(4) విఫలమైనా, స్టీవ్‌ స్మిత్‌, సంజూ శాంసన్‌ల జోడి 81 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. 9 ఓవర్ల ముగిసే సరికి రాజస్తాన్‌ రాయల్స్‌ 100 పరుగుల మార్కును దాటడంతో రాజస్తాన్‌ సునాయాసంగా విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ మ్యాచ్‌ చివరి వరకూ నువ్వా-నేనా అన్నట్లు సాగింది. ఒకవైపు శాంసన్‌ పరుగుల మోత మోగిస్తుంటే, తెవాతియా తొలుత ఆపసోపాలు పడ్డాడు. కానీ ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టిన తెవాతియా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.  శాంసన్‌ ఔటైన తర్వాత తెవాతియా బ్యాట్‌కు పని చెప్పడంతో రాజస్తాన్‌ చివరకు విజయాన్ని నమోదు చేసింది. ఆఖర్లో ఆర్చర్‌ (13 నాటౌట్‌) 3 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టడంతో రాజస్తాన్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ టార్గెట్‌లో ఇంకా మూడు బంతులు ఉండగానే రాజస్తాన్‌ గెలుపును అందుకుంది.