నేటి నుండి తెలంగాణా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో సుదీర్ఘ విరామం, దాదాపు మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేప్యథంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం సెప్టెంబర్‌ 8న నిలిపివేసింది. కాగా, ధరణీ పోర్టల్‌ ద్వారా నవంబర్‌ 2న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా నేటి నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే ఒకేసారి రికార్డుల్లో పేరు మార్పు (మ్యుటేషన్‌) పూర్తి చేయడంతో పాటు ఈ-పాస్‌ పుస్తకాన్ని అందచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముందస్తుగా స్లాట్‌బుక్‌ చేసుకున్నవారికే రిజిస్ట్రేషన్‌ అవకాశం కల్పిస్తారు. దీనికోసం శుక్రవారమే స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. స్లాట్‌ బుకింగ్‌ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఆన్‌లైన్‌ విధానంలో నిర్ణీత రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని సూచించింది. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌బుకింగ్‌ అవకాశం కల్పించారు. అదేవిధంగా మీ-సేవా కేంద్రాల్లో రూ.200 చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఒక్కో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రోజుకు 24 స్లాట్లనే కేటాయించారు.