వైసీపీ నేతల కన్నా రాబంధులు నయం

  • వైసీపీ అసమర్ధతను ప్రశ్నిస్తే హింసిస్తారా?
  • దళితులపై తమ దమనకాండను కొనసాగిస్తున్న వైవీపీ ప్రభుత్వం
  • అధినేత హత్యలకు ప్రేరేపిస్తుంటే ద్వితీయస్థాయి నేతలు ప్రజల్ని ఆత్మహత్యలకు పాల్పడేలా చేయటం దుర్మార్గం
  • ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విమలకు మెరుగైన వైద్యంతో పాటు ఆర్థికంగానూ ఆదుకోవాలి
  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రానం మార్కండేయ బాబు, గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: రాష్ట్రంలో అనధికార ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని, బ్రతికుండగానే ప్రజలకు నరకయాతన చూపిస్తున్న వైసీపీ నేతల కన్నా శవాలని పీక్కుతినే రాబందులు మేలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. కార్పొరేటర్ వేధింపుల నేపధ్యంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు కనపర్తి విమలను జనసేన పార్టీ నేతలు మంగళవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అక్కడి డాక్టర్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ గడపగడప కార్యక్రమంలో వైసీపీ శాసనసభ్యుడు మద్దాలి గిరి, స్థానిక కార్పొరేటర్ యక్కలూరి మారుతీ రెడ్డిలు తన ఇంటిముంగిటకు వచ్చినప్పుడు ప్రభుత్వం ద్వారా తమకేమీ సంక్షేమ లబ్ది చేకూరటం లేదంటూ విమల తన గోడుని విన్నవించుకోవటంతో వైసీపీ నేతలకు ఎక్కడలేని కోపం వచ్చిందని దుయ్యబట్టారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేని వైసీపీ నేతలు ప్రజలపై ప్రధానంగా దళితులపై బెదిరింపులకు దిగటం దుర్మార్గమన్నారు. నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే హింసిస్తారా అంటూ వైసీపీ నేతల్ని నిలదీశారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన వైసీపీ అధినేత హత్యల్ని ప్రేరేపిస్తుంటే వారి అనునూయులు తమ దాష్టీకాలతో ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే వైసీపీ నేతలు మా యస్సిలు, మా దళితులు అంటుంటారని ఆ మాటలన్నీ వారి పెదాల నుంచి మాత్రమే వస్తాయని విమర్శించారు. దళితులపై నిజంగా ప్రేమ ఉన్నా వైసీపీ అధికారంలోకి రావటానికి పునాది దళితులే అన్న గౌరవం ఉన్నా ఇలా దళితులపై దమనకాండను కొనసాగించరని సురేష్ అన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికురాలికి ఇంత అన్యాయం జరుగుతుంటే నగరపాలక సంస్థ కమీషనర్ కానీ పాలకవర్గం కానీ ఇంతవరకు స్పందించకపోవటం శోచనీయమన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు మీరిచ్చే విలువ ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. విమల ఆత్మహత్యాయత్నంకు కారణమైన వారిపై జాతీయ యస్సి ఎస్టీ కమీషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ కనపర్తి విమలను మరలా విధుల్లోకి తీసుకోవాలని, ఆర్ధికంగా ఆదుకోవాలని వైసీపీ నేతల్ని కోరారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తరుపున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రం ఒక శాడిస్ట్ చేతిలో బందీ అయిందని త్వరలోనే జనసేన అధినేత ఈ రాష్ట్రాన్ని బంధ విముక్తిని చేయనున్నాడని ఆళ్ళ హరి అన్నారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకా రాజు, రెల్లి యువనేత సోమి ఉదయ్, పుల్లంసెట్టి ఉదయ్ కుమార్, దుర్గ ప్రసాద్, ఏడుకొండలు, పులిగడ్డ నాగేశ్వరరావు, శాంతి కుమార్, జడ సురేష్, తదితరులు పాల్గొన్నారు.