ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. ఫలితాలు ‘అసంతృప్తి ఉంటే.. పరీక్షలకు సిద్ధం’

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం నేడు ఫలితాలు వెల్లడించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పరీక్షలు జరగని నేపథ్యంలో కమిటీ సిఫారసుల మేరకు పదో తరగతి మార్కుల ఆధారంగా 30 శాతం వెయిటేజి, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజితో సెకండియర్ విద్యార్థులకు మార్కులు, తదనుగుణంగా గ్రేడ్లు కేటాయించామని వివరించారు.

ఇంటర్ సెకండియర్ లో 5,08,672 మంది విద్యార్థులు ఉండగా, అందరూ ఉత్తీర్ణులైనట్టు మంత్రి వెల్లడించారు. ఎవరైనా ఈ ఫలితాల పట్ల సంతృప్తి చెందకపోతే, వారికి తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, సుప్రీంకోర్టు ఈ నెల 31 లోపు పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ఆదేశించిందని, తాము వారం రోజుల ముందే ఫలితాలు విడుదల చేశామని తెలిపారు.

భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్‌మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. పదవ తరగతి ఫలితాలను వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు.