వాసాలమర్రికి దళిత బంధు నిధులు విడుదల

దత్తత గ్రామం వాసాలమర్రి దళితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. నిన్న ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ఆ గ్రామానికి దళిత బంధు నిధులను విడుదల చేశారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు నిధుల విడుదలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దళిత బంధు నిధులు విడుదల కావడంతో వాసాలమర్రి దళితులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై దయ చూపిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.

‘నా నోట్లకెళ్లి మాట ఎళ్లిన దగ్గరి నుంచి మీరు పది లక్షల శ్రీమంతులైర్రు. రేపు 11 గంటలు కొట్టేకల్లా డబ్బులు వస్తయి. పది లక్షల్లో పది వేలు మాత్రమే రక్షణ నిధికి పోతయి. మిగిలినవి అన్నీ మీవే. కిందికి పోకుండా కాపాడేందుకు నిధి ఉంటది.

పక్కగా జరిగేటట్టు కావలి కాసేందుకు కేసీఆర్‌ ఉంటడు. రాబోయే 15-20 రోజుల్లో భూముల కథ తేల్చేస్తా. నేను ఆరు నెలల తర్వాత వాసాలమర్రికి వచ్చినప్పుడు దళితవాడలోనే అన్నం తింట. ప్రజలు మంచిగా అయితే నాయకునికి అంతకన్న తృప్తి ఏముంటది?

పట్టుబడితే, జట్టుకడితే వాసాలమర్రి బంగారు వాసాలమర్రి అయితదో చెప్పినో అది జరిగి తీరాలి. మొత్తం రాష్ట్రంలో మీరే మొదటి బిడ్డలు. దళితబంధు మీ దగ్గర లాంచ్‌ అయిపోయింది. దళితబంధు హుజురాబాద్‌లో అయ్యేది లాంఛనమే’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.