జనసైనికుల సమస్యలపై ఉద్యమానికి వెనుకాడం: ఆమంచి స్వాములు

శ్రీశైలం నియోజకవర్గంలో, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ వారు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై, అవసరమైతే తాను సైతం ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆమంచి స్వాములు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం, శ్రీశైలంలోని శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్ సమావేశ మందిరం నందు, వివిధ పార్టీలకు చెందిన పలువురికి, పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జనసైనికులు, తాము ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని, స్వాముల దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలోని లింగాల గట్టు, సుండిపెంట, శ్రీశైలం తదితర ప్రాంతాలలో డ్రైనేజీ సమస్య, నీటి సమస్య, ఇసుక సమస్య ఉందని, నివాస గృహాలలో మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు సైతం, అటవీ శాఖ వారికి ముడుపులు సమర్పించుకోవలసి వస్తుందని, శ్రీశైలం దేవస్థానంలో పనిచేసే జనసేన, తెలుగుదేశం పార్టీల అభిమానులుగా ఉన్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను ఆ కారణంగా వేధిస్తున్నారని, అలాగే చేపలను విక్రయించుకునేందుకు బయటకు వెళ్లినా కూడా అటవీ శాఖ అధికారులు డబ్బులకే సతాయిస్తున్నారని వాపోయారు. ఈ సమస్యలపై స్వాములు స్పందిస్తూ, ముందుగా జనసైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమిష్టిగా, ఐకమత్యంతో కలిసి ఉండాలని, ఆ తర్వాత సమస్యలపై పోరాడాలని, అవసరమైతే వారికి మద్దతుగా తాను సైతం సమస్యల సాధనకు ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారని, పొత్తులో భాగంగా జనసేనలో కానీ, తెలుగుదేశంలో కానీ, ఎవరికి టికెట్ ఇచ్చిన, శక్తివంచన లేకుండా అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త అశోక్ ప్రముఖ వెలుగోడు కు చెందిన ప్రముఖ రాయరు అభిమన్యుడు హైకోర్టు న్యాయవాది ప్రసాద్ బుజ్జి తదితరులు ప్రసంగించారు.