హైదరాబాద్‌లో మొహర్రం ఊరేగింపు పై ఆంక్షలు

వినాయక చవితి వేడుకలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెల్సిందే. వీధుల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేయకూడదని తెలిపింది. తాజాగా ముస్లింలు జరుపుకునే మొహర్రం పండుగపై కూడా హైకోర్టు ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది మొహర్రం ఊరేగింపులు జరుపకూడని హైకోర్టు తెలిపింది.ఈ నెల 30న హైదరాబాదులోని పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపుకు అనుమతించేలా పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. ఊరేగింపుకు అనుమతిని ఇవ్వలేమని తెలిపింది. మొహర్రం ఊరేగింపుకు సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ను నిరాకరించిందని గుర్తుచేసింది. హైకోర్టు కూడా ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించలేమని వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని వెల్లడించింది.