ఆన్‌లైన్‌ తరగతులపై సమీక్ష

ఆన్‌లైన్‌ తరగతులను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ పాఠాలు పాఠశాలల్లో తరగతులు ప్రారంభమయ్యే వరకు కొనసాగుతాయన్నారు. రెండు రోజులుగా సాగుతున్న ఆన్‌లైన్‌ తరగతులపై మంత్రి బుధవారం సమీక్షించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్‌, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన, ఇంటర్‌ విద్య కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ ప్రసారాల్లో క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే జిల్లా కలెక్టర్లు పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. పేర్కొన్న సమయం కంటే ఎక్కువగా తరగతులు నిర్వహించే ప్రైవేటు స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.