వైసీపీ దుష్టపాలన నుంచి విముక్తి కలిగించే పాశుపతాస్త్రమే ఓటు హక్కు

గుంటూరు: వైసీపీ దుష్టపాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలన్నా, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవలన్నా ప్రజల చేతిలో ఉన్న ఒకేఒక ఆయుధం ఓటు హక్కు అని, అలాంటి ఓటు హక్కు నమోదులో అలసత్వం వహించవద్దని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ప్రజలను కోరారు. శనివారం జనసేన పార్టీ ఐ టీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు, డివిజన్ అధ్యక్షులకు ఓటు హక్కు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో ఓట్లను తొలగించటం వెనుక అధికార పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మూడో పక్షం తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరైతే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో గుర్తించి వారి ఓట్లను తొలగించే ప్రక్రియ లో ప్రభుత్వం వాలంటీర్లను పావుగా వాడుకుందని దుయ్యబట్టారు. వాలంటీర్లను ఓటు హక్కు నమోదుకై ఉపయోగించుకోవద్దని ఎన్నికల కమీషన్ చెప్పినా వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఈ నేపధ్యంలో ప్రతీఒక్కరూ తమ ఓటు ఉందో లేదో ఒకసారి పరిశీలించు కోవాలని ఓటు లేని పక్షంలో వెంటనే మరలా నమోదు చేసుకోవాలని నేరేళ్ళ సురేష్ కోరారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసున్న యువతీయువకులు, విద్యార్థులు వెంటనే ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. ఈ దేశ గతిని మార్చే యువత వజ్రాయుధం లాంటి ఓటు హక్కును పొందాలని, అప్పుడే బాధ్యత కలిగిన పాలకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓటు హక్కు నమోదులో ఎలాంటి అశ్రద్ధ చేయవద్దని, ఓటు హక్కు నమోదులో ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎప్పుడైనా ఐ టీ విభాగాన్ని సంప్రదర్శించవచ్చని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో పార్టీ ఐటీ విభాగం ప్రతినిధులు రవితేజ, సామ్రాట్, వంశీ, నోమేష్ తో పాటూ నగర కమిటీ ప్రధాన కార్యదర్శులు కటకంశెట్టి విజయలక్ష్మి, యడ్ల నాగమల్లేశ్వరరావు, సూరిశెట్టి ఉపేంద్ర నగర కమిటీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, వీరమహిళలు పాల్గొన్నారు.