దీదీ కొత్త పథకం.. రూ. 5కే భోజన పథకం ‘మా కిచెన్’

పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. టీఎంసీ, బీజేపీల ప్రచారంతో రాష్ట్రం హీటెక్కుతోంది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా… అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో మమతా బెనర్జీ ఉన్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈరోజు ఒక కీలక పథకానికి శ్రీకారం చుట్టారు. రూ. 5 రూపాయలకే భోజన పథకాన్ని ప్రారంభించారు. భోజనాన్ని అందించే ‘మా కిచెన్’ సెంటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, పేదలకు కడుపునిండా భోజనం పెట్టడమే ఈ పథకం లక్ష్యమని అన్నారు. ప్రస్తుతానికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ‘మా కిచెన్లు’ ప్రారంభించామని… త్వరలో ఈ సెంటర్లను మరింతగా పెంచుతామని చెప్పారు. ఈ సెంటర్లలో కేవలం రూ. 5కే భోజనం చేయవచ్చని అన్నారు. ప్రతి భోజనానికి రూ. 15 సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా పేదలకు తక్కువ ధరకే భోజనం దొరకడమే కాకుండా… ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుందని అన్నారు.

‘మా కిచెన్ల’తో పాటు పలు ప్రాజెక్టులను దీదీ ప్రారంభించారు. సాల్ట్ లేక్ వద్ద ఐటీ పార్కును లాంచ్ చేశారు. బెంగాల్ లో కేన్సర్ పేషెంట్ల గుర్తింపు, చికిత్స, రిజిస్ట్రేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ను కూడా ప్రారంభించారు.