కరోనా కు టీకా సిద్ధం: ప్రకటించిన రష్యా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి వీర విహారం చేస్తున్న వేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తూ ఆ రక్కసితో యుద్ధం చేసే వాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న యావత్ ప్రపంచానికి ఒక ఆశ చిగురింప చేస్తూ రష్యా ప్రపంచానికి ఒక శుభవార్త చెప్పింది. అదే ప్రపంచంలో తొలి కరోనా వాక్సిన్‌ను విడుదల చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకుని ఈ రిజిస్ట్రేషన్ గురించి ప్రకటించారు. ఈ కరోనా వాక్సిన్ తన కుమార్తె టీకా వేయించుకున్నట్టు ఈ సందర్భoగా తెలియచేసారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని కూడా స్పష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ తో కరోనా అదుపులోకి వచ్చే రోగ నిరోధక శక్తి శరీరంలో పెరిగుతుందని పుతిన్ చెప్పారు. మొదటి విడతగా వైద్య సిబ్బందికి మరియు ఉపాధ్యాయయులకు ఈ టీకా ఇస్తున్నామని చెప్పారు.

ప్రపంచం లోనే కరోనా వైరస్‌కు  టీకా అభివృద్ధి చేసిన మొట్ట మొదటి దేశంగా రష్యా నిలిచిందని ఇదొక చారిత్రాత్మక విజయమని పుతిన్‌ ప్రకటించారు. ఈరోజు నిర్వహించిన సమావేశంలో వాక్సిన్ అభివృద్ధి కోసం కృషి చేసిన వారందరికీ పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. యావత్ ప్రపంచానికి ఇది ఎంతో కీలకమైన ఘట్టమని అని ఆయన అన్నారు. అతి త్వరలో కరోనా వాక్సిన్‌ను ఉత్పత్తిని మరింత వేగవంతం చేసి ప్రపంచమంతటికీ ఈ వాక్సిన్ అందుబాటులో ఉంచుతామని. అయితే ఈ వాక్సిన్ గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మరియు రష్యా రక్షణశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఈ వాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభమవగా ఇప్పటి వరకు 38 మంది వాలంటీర్లపై ఔషధ ప్రయోగాలు చేశారు. మొదటి విడత వాలంటీర్లు జులై 15న డిశ్చార్జి అవగా రెండవ బ్యాచ్ వాలంటీర్లు జులై 20న డిశ్చార్జి అయ్యారు. వీరందరిలోనూ రోగ నిరోధక శక్తి పెరిగి సంపూర్ణారోగ్యంతో ఉన్నారు.