ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్‌ క్లాస్‌లు: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సబిత ఇంద్రారెడ్డి సోమవారం సమావేశమై… ప్రవేశ పరీక్షలు, విద్యా సంవత్సరంపై సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..

ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తాం. సెప్టెంబరు 1 నుంచి 3-5 తరగతులు విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహిస్తాం. ఈ నెల 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయి. సెప్టెంబరు 1 తర్వాత ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్, సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నాం అని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు.

మరోవైపు, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ఎంసెట్ సహా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.