20దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేసిన రష్యా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రష్యా తొలి టీకాను ప్రకటించడమే కాకుండా వ్యాక్సిన్‌కు స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ అని నామకరణం చేసింది. రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న సంస్థ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ అధిపతి కిరిల్‌ దిమిత్రియేవ్‌ తెలిపారు.

ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ బుధవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. అలాగే, పరిశ్రమల్లో దీని ఉత్పత్తి మాత్రం సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌పై విదేశాలు ఆసక్తి చూపుతున్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ పొందేందుకు ఇప్పటికే 20 దేశాల నుంచి దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. విదేశీ భాగస్వాములతో కలిసి రష్యా ఏడాదికి 500 మిలియన్‌ డోసుల వ్యాక్సిన్‌ను ఐదు దేశాల్లో ఉత్పత్తి చేస్తుందని ఆయన తెలిపారు.