నేటినుంచి శబరిమల అయ్యప్ప దర్శనం

కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలోని అయ్యప్ప దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. వార్షిక మండల మకరవిళక్కు పూజకోసం దేవస్థానాన్ని నిన్న సాయంత్రం తెరిచారు. ఆలయ ప్రధాన పూజరి ఏకే సుధీర్ నంబూత్రి గర్భగుడి తలుపులు తెరిచి దీపాలు వెలిగించారు. ఈ పూజ రెండు నెలలపాటు కొనసాగనుంది. దీంతో నేటి నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దర్శనాలపై ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు (టీడీబీ) ఆంక్షలు విధించింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. వారాంతాల్లో రెండు వేలమంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. భక్తులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్‌ అని ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకోవలసి ఉంటుంది. పంపాకు వద్ద ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ వద్దకు 24 గంటల లోపే చేయించిన నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటే, అక్కడ మరలా దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసిన ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది.

అక్కడ కూడా నెగిటివ్ వస్తే అలాంటి వారిని కొండమీదకు అనుమతించనున్నారు. ఒకవేళ అక్కడ పాజిటివ్ అని తేలితే వెంటనే కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారెంటైన్ సెంటర్లకు భక్తులను తరలించనున్నారు.  కాగా, పంపా నదిలో స్నానాలపై నిషేదం విధించారు. కరోనా లక్షణాలున్నవారు, కరోనా నుంచి కోలుకున్నవారు దర్శనానికి రావద్దని టీడీబీ సూచించింది. అదేవిధంగా 60 ఏండ్లు పైబడినవారికి, పదేండ్ల లోపు పిల్లలకు శబరిమలకు అనుమతి లేదని శబరిమల ఆలయ మండలి సూచించింది.

అయితే కొండ మీదకి ఎక్కే సమయంలో మాస్కు తప్పనిసరికాదని వెల్లడించింది. వార్షిక మండల మకరవిళక్కు పూజలు రెండు నెలలపాటు సాగనున్నాయి. దీంతో డిసెంబర్‌ 26 వరకు శబరిమల ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు.