ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ

అమరావతి: గుంటూరు జిల్లా వడ్లమూడి వద్ద ఉన్న సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీలో వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నివేదిక సమర్పించింది. ఏసీబీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్‌ వెల్లడించింది. అంతకుముందు సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసింది. బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కాసేపటికే ఉపసంహరించుకుంది. జీవో 515ను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని తీసుకొస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై సంగం డెయిరీ రోజువారీ కార్యకలాపాల బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగించింది. ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకునే అధికారాలను సబ్‌కలెక్టర్‌కు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.