వైసీపీ నేతల పైశాచికత్వం పరాకాష్టకు చేరుకుంది: ఆళ్ళ హరి

గుంటూరు: అధికారాన్ని అడ్డం ప్రట్టుకొని వైసీపీ చేస్తున్న అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, దుర్మార్గాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు అరెస్టుని తెరపైకి తెచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కనపడకుండా చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. విపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేస్తూ వైసీపీ పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో దోచుకున్న ప్రజాధనంతో ముఖ్యమంత్రి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడన్నారు. మంగళగిరికి వస్తున్న పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం చూస్తుంటే జనసేన అంటే వైసీపీ నేతల వెన్నుల్లో ఎంత వణుకు పుడుతుందో అర్ధం అవుతుందన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలని వైసిపి ప్రభుత్వం చూసిందని, జనసైనికుల ఆగ్రహం ఎలా ఉంటుందో ఊహించి వెనకడుగు వేశారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే అధికార పార్టీ లక్ష్యంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తున్న ప్రతీ ఒక్కరూ తగిన సమయంలో వడ్డీతో సహా అంతకంతా అనుభవించక తప్పదని ఆళ్ళ హరి అన్నారు.