ఎస్ఈసీ కీలక నిర్ణయం.. 14 చోట్ల మళ్లీ నామినేషన్ వేసే అవకాశం

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి కార్పొరేషన్ తో పాటు రాయచోటి, పుంగనూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలలో 14 చోట్ల మళ్లీ నామినేషన్లు వేసేందుకు అవకాశాన్ని కల్పిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా తాము నామినేషన్లు వేయలేకపోయామంటూ పలువురు వ్యక్తులు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతిలోని 2, 8, 10, 21, 41, 45 వార్డులు, పుంగనూరులో 9, 14, 28 వార్డులు, కడప జిల్లా ఎర్రగుంట్లలో 6, 11, 15 వార్డులు, రాయచోటిలో 20, 31 వార్డుల్లో మళ్లీ నామినేషన్లు వేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.