ఐపీఎల్‌లో పంజాబ్‌కు రెండో విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. బెంగళూరుపై 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుని బరిలోకి దిగి 171 పరుగులు చేశారు. నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. పంజాబ్ ముందు 172 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించారు. విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచిన మయాంక్ 25 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 49 బంతుల్లో ఐదు సిక్స్‌లు, ఫోర్‌తో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఆడిన క్రిస్ గేల్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గేల్ 45 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 పరుగులు చేశాడు. కాగా చివరి ఓవర్ గేల్ ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే చివరి బంతికి పురాన్ సిక్స్ కొట్టడంతో పంజాబ్‌కు విజయం లభించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఓపెనర్లు అరోన్ ఫించ్, దేవ్‌దూత్ పడిక్కల్ శుభారంభం అందించారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ఒక ఫోర్, సిక్స్‌తో 18 పరుగులు చేసి జోరు మీద కనిపించిన పడిక్కల్‌ను అర్ష్‌దీప్ సింగ్ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్ అరోన్ ఫించ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ విరాట్ కోహ్లి తన పోరాటాన్ని కొనసాగించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 39 బంతుల్లో మూడు ఫోర్లతో 48 పరుగులు సాధించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మోరిస్ 8 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 25 పరుగులు చేశాడు.