భారీ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా..

ఆసీస్ జట్టుపై టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో విరాట్ కోహ్లీ సేన పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సాధించింది. సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ను గెలిచింది. వన్డేల్లో తేలిపోయిన టీమిండియా టీ20ల్లో మాత్రం దూకుడు ప్రదర్శించి, సత్తా చాటింది. విదేశాలలో 2019 నుంచి భారత్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఓటమి చెందకపోవడం గమనార్హం. వరుసగా 10వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా నెగ్గింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూవెడ్ (58: 32 బంతుల్లో 10×4, 1×6), స్టీవ్‌స్మిత్ (46: 38 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. అయితే తొలి టీ20లో రాణించిన టీమిండియా బౌలర్ యుజువేంద్ర చాహల్ (1/51) సహా దీపక్ చాహర్ ధారాళంగా పరుగులిచ్చి నిరాశ పరిచారు. యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ 2/20తో ఆసీస్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. దీంతో ఆసీస్ 200 పరుగులలోపే ఇన్నింగ్స్ ముగించింది.