బోరున విలపిస్తూ వింబుల్డన్ నుంచి వైదొలగిన సెరీనా విలియమ్స్!

అమెరికాకు చెందిన దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ కలలు కల్లలయ్యాయి. ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్ ను గెలవాలన్న ఏకైక లక్ష్యంతో, తన చివరి గ్రాండ్ స్లామ్ ఆడేందుకు బరిలోకి దిగిన ఆమె, తొలి రౌండ్ నుంచి వైదొలగింది. యువ క్రీడాకారిణి, బెలారస్ కు చెందిన అలెక్సాండ్రా సస్నోవిచ్‌ తో 39 సంవత్సరాల వయసులోనూ సత్తా చాటుతూ తొలి సెట్ లో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఆపై ఓ షాట్ ఆడే క్రమంలో కిందపడగా, ఎడమ మడమకు గాయమైంది. డాక్టర్లు పరిశీలించిన అనంతరం ఆటను కొనసాగించిన ఆమె, మునుపటి స్థాయిలో రాణించలేక ఒక సెట్ ను కోల్పోయింది. ఇక ఆడలేనంటూ సెంటర్ కోర్టులో కన్నీటి పర్యంతమైంది. ఏడుస్తూనే మైదానాన్ని వీడింది. వింబుల్డన్ తొలి రౌండ్ లోనే సెరీనా నిష్క్రమించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టెన్నిస్ ప్రపంచం ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజయం సాధించిన తరువాత, ఆమె మరో గ్రాండ్ స్లామ్ ను గెలవలేదన్న సంగతి తెలిసిందే.

ఆపై జరిగిన మరో మ్యాచ్ లో మాజీ నంబర్ వన్, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్, గట్టిపోటీని ఎదుర్కొని మ్యాచ్ లో విజయం సాధించాడు. ఫ్రాన్స్ కు చెందిన అడ్రియన్ మనారినోతో తలపడిన ఆయన తొలి సెట్ ను నెగ్గి, ఆపై రెండు, మూడు సెట్లలో ఓడిపోయారు. కీలకమైన నాలుగో సెట్ జరుగుతున్న వేళ, మనారినో కోర్టులో కిందపడి, ఇక ఆడలేనంటూ వెళ్లిపోవడంతో ఫెదరర్ గెలిచినట్లయింది. ఈ మ్యాచ్ దాదాపు 2 గంటల 45 నిమిషాలు సాగింది.