సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి: కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమావేశాల్లో అటు ఆర్టీసీతో పాటు.. ఇటు వ్యవసాయంపై కూడా సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్త ఆయకట్టును రూపొందించడంతో పాటు, నాగార్జున సాగర్‌ ఆయకట్టును కూడా కలుపుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైందని సీఎం తెలిపారు. ఇక.. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి, అటు ఇల్లందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్‌ కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలని సీఎం సూచించారు. దీంతో పాటు సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాలువలకు సంబంధించిన మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి, టెండర్లు పిలవాలని తెలిపారు. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్‌ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్‌ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. కృష్ణానదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియదు. అంతా అనిశ్చితి. కృష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్‌ ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం అధికారులకు దిశా నిర్ధేశం చేశారు.