సిడ్నీ టెస్టులో స్మిత్ రికార్డులు

క్రికెట్‌లో రికార్డుల రారాజులు మన ఇండియన్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్‌, విరాట్ కోహ్లి. కానీ ఇప్పుడా ఇద్దరి రికార్డులనే బద్ధలు కొట్టాడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌. ఇండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తొలి రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలమైన స్మిత్‌.. మూడో టెస్టులో అద్భుత సెంచరీ సాధించాడు. తొలి రోజు 31 పరుగులు చేసిన స్మిత్.. రెండో రోజు దూకుడు పెంచాడు. ఒకవైపు ఆసీస్ వికెట్లు పడుతున్నా స్మిత్ తన దూకుడును ఆపలేదు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన స్మిత్ 131 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతడు ఈ ఇద్దరి రికార్డులను అధిగమించాడు. స్మిత్‌కు టెస్టుల్లో ఇది 27వ సెంచరీ. టెస్ట్ క్రికెట్‌లో 27 సెంచరీల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్లలో స్మిత్ రెండోస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ 70 ఇన్నింగ్స్‌తో తొలి స్థానంలో ఉండగా.. స్మిత్ ఇప్పుడు 136వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. అదే కోహ్లి, సచిన్ ఇద్దరూ తమ 141వ ఇన్నింగ్స్‌లో 27వ సెంచరీ చేశారు. అంతేకాదు టెస్టుల్లో కోహ్లి పరుగుల (7318)ను కూడా ఈ ఇన్నింగ్స్‌తో స్మిత్ అధిగమించాడు. ప్రస్తుతం స్మిత్ ఖాతాలో 7368 రన్స్ ఉన్నాయి.