తెరపైకి మరోసారి ప్రత్యేక హోదా!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చకు పెట్టాలని తీర్మానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈనెల 14న తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల భేటీలో చర్చించాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలన్నీ చర్చకు వచ్చేలా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో ఏపీతో ముడిపడినవి ఏమైనా ఉంటే వాటిపై తగిన రీతిలో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో సీఎం ప్రస్తావించిన ఇతర అంశాలు..

* ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను ఎజెండాలో పొందుపరచాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలను లేవనెత్తాలి.

* తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్తు బకాయిలు, రెవెన్యూ లోటు, హేతుబద్ధతలేని లేని రీతిలో రేషన్‌ బియ్యం కేటాయింపులు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు తదితర అంశాలను ప్రస్తావించాలి.

* నదుల అనుసంధానంపై కేంద్రం రూపొందిస్తున్న ప్రతిపాదనల విషయంలో రాష్ట్రానికి మేలు జరిగేలా, రాష్ట్రం సూచించే ప్రత్యామ్నాయ వివరాలను పొందుపరచాలి.