బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..

తెలంగాణలో నిర్మిల్ జిల్లాలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. సరస్వతీ దేవి జన్మించిన వసంత పంచమి నేడు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు మూడు క్యూలైన్లలో వేచి ఉండగా.. దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాగా, వసంత పంచమి పర్వదినం సందర్భంగా విద్యా ప్రదాయిని సరస్వతి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. కాగా, ఆలయ అర్చకులు, వేదపండితులు వేకువజామున రెండు గంటలకు సరస్వతి, మహా కాళీ, లక్ష్మీ అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, గణపతి పూజ, సుప్రభాత సేవ నిర్వహించారు. ఇక మూడు గంటల నుంచే అక్షర స్వీకార పూజలు మొదలయ్యాయి.

మరోవైపు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక డీఎస్పీ, ఆరుగురు సీఐలు, 25 మంది ఎస్సైలు, 300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఆలయ అతిథి గృహాలు నిండిపోవడంతో భక్తులు ప్రైవేటు అతిథి గృహాలను ఆశ్రయిస్తున్నారు.

ఇదిలాఉండగా, ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శఆఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి దంపతులు జ్ఞాన సరస్వతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.