సేవా మార్గమే ముక్తి మార్గమని నమ్మిన శ్రీ బాబా నౌషీర్ జీ

* తదేకం ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ బాబా నౌషీర్ జీ కాలధర్మం బాధాకరం
* శ్రీ బాబా నౌషీర్ జీ స్ఫూర్తిని ఫౌండేషన్ సభ్యులు ముందుకు తీసుకెళ్లాలి

శ్రీ మహావతార్ బాబాజీ బోధనలే సమాజ సేవా మార్గాలుగా భావించి.. ఆయన పేరు మీదనే తదేకం ఫౌండేషన్ స్థాపించి దేశవ్యాప్తంగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న గురూజీ శ్రీ బాబా నౌషీర్ జీ కాల ధర్మం చెందారనే వార్త నన్ను ఎంతగానో కలచివేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. పుణె ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న తదేకం ఫౌండేషన్ వ్యవస్థాపకులయిన శ్రీ బాబా నౌషీర్ జీ తుది శ్వాస వరకు తన దృష్టిని సమాజసేవపై నిలిపారు. ‘‘మీరు గురువును ఎంచుకుంటే అనుచరులుగా మిగిలిపోతారు… అదే గురువు మిమ్మల్ని ఎంచుకుంటే మీరు శిష్యులుగా మారతారు’’అనేది మహావతార్ బాబా తదేకం ఫౌండేషన్ పాటించే విశిష్ట సూత్రం. అత్యుత్తమ గురువు దృష్టి ఎపుడూ అత్యుత్తమ శిష్యులను ఎంచుకోవడం మీదనే ఉంటుంది. తమ శక్తి సామర్థ్యాలను పది మందికీ పంచి సమాజాన్ని మహోన్నత మార్గంలో నడిపించేందుకు వారు పరితపిస్తారు. జ్ఞానాన్ని దివిటీగా చేసుకొని, సేవా మార్గంలో సాటి వారికి సాయపడుతూ ముందుకు వెళితే కచ్చితంగా మానవ జీవితం ముక్తి వద్దనే ముగింపు పలుకుతుందన్నది మహర్షుల మాట. గురు శ్రీ బాబా నౌషీర్ జీ ఎంతో బాధ్యతగా స్థాపించిన తదేకం ఫౌండేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలు అనేకం. ఆపదలో ఉన్న వారికి మేమున్నామని ఆ ఫౌండేషన్ ఇచ్చే ధైర్యం అమూల్యం. జనసేన పార్టీతో కలసి వారు అందిస్తున్న సేవలు ఎందరో పేదలు, దివ్యాంగుల కళ్ళలో ఆనందాన్ని నింపుతున్నాయి. స్త్రీలు స్వయం శక్తితో నిలిచేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు నన్ను కలుసుకొని గురూజీ పంపిన సందేశాన్ని అందించారు. తదేకం ఫౌండేషన్ ద్వారా ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. సేవా కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రణాళిక నన్ను ఆలోచింపచేసింది. ఒక యోగి ఆత్మకథ పుస్తకం నన్ను కదిలించింది. క్రియా యోగాను కొన్ని రోజులు పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాను. దీనిలో మహోన్నత గురువుగా భావించే శ్రీ మహావతార్ బాబాజీ స్ఫూర్తిని నిలువెల్లా నింపుకొని తదేకం ఫౌండేషన్ కార్యక్రమాలను విశ్వవ్యాపితం చేయాలని శ్రీ బాబా నౌషీర్ జీ కలలు కన్నారు. ఆయన నేడు భౌతికంగా మన మధ్య లేకున్నా వారు నింపిన స్ఫూర్తిని ఫౌండేషన్ సభ్యులు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. అనంత లోకాలకు తరలివెళ్లిన శ్రీ బాబా నౌషీర్ జీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను. నా తరఫున, జనసేన తరఫున ఆయనకు వినమ్ర అంజలి ఘటిస్తున్నానని
పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *