తెలుగు కీర్తి పతాక శ్రీ పింగళి వెంకయ్య

మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకం.. భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీక. మన త్రివర్ణ పతాకాన్ని వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు.. అక్షర సత్యం. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య గారు చరితార్థుడు. ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి పుణ్యఫలం. ఆ మహానుభావుని 146వ జయంతి సందర్భాన నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న శుభతరుణంలో జాతి యావత్తు వజ్రోత్సవాలు జరుపుకోడానికి సమాయత్తమవుతున్న వేళ స్వర్గీయ శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి కూడా జరగడం యాదృచ్చికమే అయినా అదొక మరుపురాని మహత్తర ఘట్టం. దేశం పరాయి పాలనలో అరాచకాలను చవి చూస్తున్న తరుణంలో జాతిని ఏకం చేయడానికి దేశానికి ఒక పతాకం అవసరమని ఏళ్ల తరబడి ఘోషిస్తూ, శ్రమిస్తూ చివరికి ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించారు శ్రీ పింగళి. తుదకు 1921 మార్చిలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీజీ ఆశీస్సులతో శ్రీ పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకం భారత జాతీయ పతాకంగా ఆమోదం పొందింది. ఈ ఘడియల కోసం శ్రీ పింగళి ఒక తపస్సునే చేశారు. విద్యాధికుడు, వ్యవసాయం, భూగర్భశాస్త్రంలో నిపుణుడు అయిన శ్రీ పింగళి వెంకయ్య గారిని ఎందువల్లనో ఇటు తెలుగు రాజకీయ నాయకులు, అటు జాతీయ నాయకులు సరైన సమయంలో ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించకపోవడంతో ఆర్థికంగా దుర్భరమైన జీవితాన్ని చరమాంకంలో చవిచూశారు. ఇది అత్యంత దురదృష్టకరం. ఆ త్యాగశీలికి ‘భారతరత్న’పురస్కారం అందించాలని తెలుగు ప్రజల కోరిక. అది ఇంతవరకు నెరవేరలేదు. దేశంలో ‘ఆజాది కా అమృతోత్సవ్’ వేడుకలు జరుగుతున్న ఈ శుభ ఘడియలలో శ్రీ పింగళి వెంకయ్య గారి సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ కోరారు.