కన్నులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రామచంద్ర మహా ప్రభువుల వారికి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణం జరిగిన మరుసటి రోజే అదే వేదికపై మహా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా భక్తులు లేకుండానే వేడుకను నిర్వహించారు. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడు, రఘువంశ తిలకుడైన శ్రీరాముడు.. పట్టాభిషిక్తుడయ్యాడు. ఒక సమర్థుడైన వ్యక్తికి ప్రజా పరిపాలన అనే పట్టం అందించే కార్యక్రమమే పట్టాభిషేకం. ప్రపంచంలో రాముడికి మించిన పరిపాలనాదక్షుడు మరెవ్వ లేరు. సాటిరారు. రాముడు రాజు కావడంతో పట్టాభిషేకం నిర్వహించడం భద్రాద్రి రామాలయంలో సంప్రదాయం.

వైభవంగా పట్టాభిషేకం..

ఉత్సవమూర్తులకు పంచామృతాలతో నవకలశ స్నపనం చేశారు. చతుఃస్థానార్చన, చతుర్వేద పంచసూక్తి హవనం, పూర్ణాహుతి, నివేదన, నూతన వస్ర్తాలంకరణ నిర్వహించారు. అనంతరం నూతన దంపతులైన సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేయించి, పట్టాభిషేకం నిర్వహించి బేడా మండపంలో ఆశీనులను చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి పట్టాభిషేకం క్రతువు సాగింది. ఉత్సవాంగ ఆరాధన, మండపారాధన, దేవతామూర్తుల కలశావాహన చేశారు. అనంతరం లఘు తిరువారాధన జరిపారు. సువర్ణ పుష్పార్చన, రామాష్టోత్తరం, లక్ష్మి అష్టోత్తర పూజలు, ఫల నివేదన చేసి, మంగళ నీరాజనం పలికారు. తదుపరి పట్టాభిషేకం ఘట్టం ప్రారంభించారు. తరువాత రాజాధిరాజ మంత్రం జపిస్తూ వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాన్ని రామచంద్రుల మహా ప్రభువుల వారి శిరస్సున అలంకరించారు. ఆ తదుపరి సప్త నదీ జలాలు, నాలుగు సముద్ర జలాలతో అభిషేకం జరిపారు. ఇదే రామరాజ్య స్థాపనకు సుముహూర్తంగా వేద పండితులు ప్రకటించారు. ఈ సమయంలో జయజయధ్వానాలు మార్మోగాయి. పట్టాభిషేకం ముగింపు సందర్భంగా చతర్వేద పఠనం చేశారు. దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, దేవస్థానం ఈఓ శివాజీ, మాజీ ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు దంపతులు, స్పెషల్‌ సబ్‌ జైల్‌ సూపరింటెండెండ్‌ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు సదస్యం

సీతారాముల కల్యాణం అనంతరం పట్టాభిషేకం, మరుసటి రోజు నూతన వధూవరులకు వేద పండితులు వేదాశ్వీరచనం చేస్తారు. దీనినే సదస్యం అంటారు. శుక్రవారం దీన్ని నిర్వహించనున్నారు.