చెరువుల నిండా నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి

  • వర్షాలకు ముందే చెరువుల కానాలు, మధుములు, షట్టర్లు కు మరమ్మత్తులు చేయించాలి
  • బలహీనంగా ఉన్న చెరువుగట్లను బలంగా పునరిద్దరించాలి
  • ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, వర్షాలు కురవక ముందే పార్వతీపురం మన్యం జిల్లాలోని చెరువుల్లో పూర్తిగా నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు వంగల దాలి నాయుడు కోరారు. గురువారం పార్వతీపురం పట్టణంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రఘు సత్య సింహా చక్రవర్తి, పట్టణ అధ్యక్షులు శిగడాం భాస్కరరావు, మండల అధ్యక్షులు బలగ శంకర్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా దాదాపుగా వర్షాధారమని, రైతులు తమ వ్యవసాయాన్ని రుతుపవనాలపై ఆధారపడి పంటలు పండిస్తారన్నారు. అటువంటి వ్యవసాయానికి జిల్లాలో ఉన్న చెరువుల నిండా నీరు నిల్వ ఉంటే వర్షాలు ఒకవేళ బుటాబొటి అయినా, వర్షాలు ఎడపెట్టినా చెరువుల్లో నీరు కష్టకాలంలో పంటలను ఆదుకుంటాయన్నారు. జిల్లాలో పలు చెరువులు మధుములు, కానాలు, షట్టర్లు పాడయ్యాయని వాటిని తక్షణమే మరమ్మత్తులు చేపట్టి పునరుద్ధరించాలన్నారు. విరివిగా వర్షాలు కురిసేటప్పుడు కొన్ని చెరువులు గట్లు బలహీనంగా ఉండటం వల్ల గట్లు తెగిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. కాబట్టి ముందుగానే సంబంధిత ఆయా శాఖలకు చెందిన అధికారులు చెరువుల్లో నీరు పూర్తిగా నిల్వ ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనిలో భాగంగా చెరువుగట్లను బలంగా తీర్చిదిద్దడం, పాడైన కానాలు, మధములు, షటర్లు పునరుద్ధరించాలన్నారు. ముఖ్యంగా ఆయకట్టు భూములకు పూర్తిగా చెరువు నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. జూన్ మొదటి వారానికి నైరుతి పవనాలు వచ్చే అవకాశం ఉందని, వర్షాలు కురవడం ప్రారంభమవుతాయన్నారు. కాబట్టి ఇప్పుడే తగు చర్యలు చేపట్టాలని కోరారు.