వీగిన అవిశ్వాసం.. ఖతార్‌దే అధికారం..

హర్యానాలోని మనోహర్‌లాల్‌ ఖతార్‌ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించింది. అధికార బిజెపి – జెజెపి కూటమికి 55 ఓట్లు రాగా, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కేవలం 32 ఓట్లు మాత్రమే కూడగట్టగలిగింది. దీంతో ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత భూపిందర్‌ సింగ్‌ హుడా బుధవారంనాడు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అధికార కూటమికి ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే కానీ విశ్వాస తీర్మానం నిలబడదు. అయితే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తగినంత మంది ఎమ్మెల్యేలను కూడగట్టడంలో విఫలమైంది.