జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్.. కిక్కిరిసిపోతున్న ముంబై రైల్వే స్టేషన్లు!

మహారాష్ట్రలో ప్రతి రోజు ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. జనతా కర్ఫ్యూ వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో, వారంతా వాళ్ల సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కుర్లాలోని లోకమాన్య తిలక్ టర్మినస్ రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుండటంతో… పోలీసులు అదనపు బలగాలను మోహరింపజేశారు.

మరోవైపు, కేంద్ర రైల్వే చీఫ్ శివాజీ సుతార్ మాట్లాడుతూ, ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. టికెట్లు కన్ఫామ్ అయిన వారు మాత్రమే స్టేషన్లకు రావాలని సూచించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రయాణికులు గుంపులు గుంపులుగా ఉండొద్దని హెచ్చరించారు.