రామతీర్థం ఘటనపై స్పందించిన సుమన్..

ఆంధ్రప్రదేశ్‌లోని రామతీర్థం ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. రాముడి విగ్రహం తలను విరగ్గొట్టడంతో పలు రాజకీయ పార్టీలు వేటికవే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు నిందితుల వేటలో ఉన్నారు. కాగా, ఈ ఘటనపై సినీ నటుడు సుమన్ స్పందించారు.

విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారో నిర్ధారణకు రాకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు. సీఎం జగన్‌కు చెడ్డపేరు తీసుకురావడానికి ప్రతిపక్ష నాయకులే ఆ విగ్రహాల ధ్వంసానికి పాల్పడి ఉంటారని ఆరోపించారు. నిందితులను గుర్తించకుండా ఒకరిమీద మరొకరు నిందలు వేయడం సరైన పద్ధతికాదన్నారు. హిందువుల మనోభావాలను దృష్టి పెట్టుకుని సీఎం జగన్ దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని పేర్కొన్నారు. ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు.