భారత్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశంలో కరోనా వైరస్ ప్రభావం గత ఏడాది కన్నా రెండు రెట్లు అధికంగా కనిపిస్తుంది. కరోనా సెకండ్ వేవ్‌లో దేశంలో 24 గంటల వ్యవధిలో దాదాపు 4 లక్షల పాజిటివ్ కేసులు దాదాపు 3500 మేర కోవిడ్19 మరణాలు సంభవిస్తుండటంతో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు  స్పందించింది. గత ఏడాది తరహాలోనే పూర్తి స్థాయిలో కరోనా లాక్‌డౌన్ విధించడంపై ఆలోచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడం, మరణాలు సైతం ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. ఏపీ తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు  ఆదివారం నాడు సూచించింది. సత్వరమే చర్యలు చేపట్టి కరోనా పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశించింది.

ప్రజలు ఒకేచోట భారీ సంఖ్యలో గుడిగూడే ప్రాంతాలపై నిషేధం, ఆంక్షలు విధించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో ప్రజల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్  సైతం విధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అయితే రోజువారీ పనులపై ఆధారపడి జీవనం సాగించేవారికి తగిన వసతులు ఏర్పాటు చేసిన అనంతరం లాక్‌డౌన్ లాంటి నిర్ణయాలు ప్రకటించాలని ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది.