విశాఖలో యువతిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం !

విశాఖలో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ ఫెర్రీ వీధికి చెందిన వాలంటీర్‌ ప్రియాంకపై శ్రీకాంత్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రగాయాలపాలైన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రియాంక సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నారని తెలిసింది. ప్రియాంకపై దాడి తర్వాత శ్రీకాంత్‌ కూడా ఆత్మహత్యకు యత్నించగా.. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రియాంకపై శ్రీకాంత్ దాడికి గల కారణాలు ఏంటీ ? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.