తెలంగాణ‌లో థియేట‌ర్లు బంద్ చేస్తార‌న్న ప్ర‌చారంపై స్పందించిన త‌ల‌సాని!

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలను మూసి వేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లను కూడా మూసివేస్తారని జరుగుతున్న ప్రచారంపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం స్పందించారు. సినిమా థియేటర్ల మూసివేత ఉండదని, యథావిధిగా నడుస్తాయని ఓ వీడియోలో మంత్రి స్పష్టం చేశారు. అలాగే థియేటర్లలో సీట్ల ఆక్యుపెన్సీ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడున్న కోవిడ్ నిబంధనల ప్రకారమే థియేటర్లు నడుస్తాయని తెలిపారు. సినిమా థియేటర్లను మళ్లీ మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళుతుందని మంత్రి చెప్పారు.