కుట్రలో భాగంగానే ధూళిపాళ్ల అరెస్ట్‌.. చంద్రబాబు మండిపాటు

అమరావతి: సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్‌కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్‌ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డెయిరీని నిర్వీర్యం చేసి పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని.. తద్వారా ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేకపోయినా అక్రమ అరెస్ట్‌లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

తమ పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరావులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ కక్షసాధింపు చర్యలని ఆక్షేపించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్‌ చేసుకుంటూ పోతే ఎవరూ మిగలరనే విషయాన్ని సీఎం జగన్‌ గుర్తించాలన్నారు. ధూళిపాళ్లను తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.