వ్యూహం మార్చి బరిలోకి దిగుతున్న టీంఇండియా

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో అనవసరపు ప్రయోగాలు చేసి చావుదెబ్బ తిన్న భారత్‌.. రెండో టీ20 కోసం జట్టులో భారీ మార్పులు చేయాలని యోచిస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను తుది జట్టులోకి ఎంపిక చేయాలని జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించి చేతులు కాల్చుకున్న భారత్‌.. ఈసారి జట్టు కూర్పు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. తొలి మ్యాచ్‌లో అంతగా ప్రభావం చూపని లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌, పేసర్‌ శార్థూల్‌ ఠాగూర్‌ల స్థానాల్లో లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ రాహుల్‌ చాహర్‌, మీడియం పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌లకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.