టీజర్ ‘కనబడుట లేదు’

బాలరాజు దర్శకత్వం వహిస్తున్న ‘కనబడుట లేదు’ సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ ఫిల్మ్ టీజర్ ను సుకుమార్ ఈ రోజు విడుదల చేసారు. ఈ చిత్రాన్ని సరయు తలశిల సమర్పణలో ఎస్.ఎస్. ఫిలిమ్స్ – శ్రీపాద క్రియేషన్స్ – షేడ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తుoడగా… మధు పొన్నాస్ సంగీతం సమకూర్చగా సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ అందించారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

టీజర్ విషయానికొస్తే ఒక డంపింగ్ యార్డ్ లో కనిపించిన రెండు శవాల గురించి పోలీసుల డిస్కషన్ తో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. శశిత అనే తన ఫ్రెండ్ మిస్సయ్యిందంటూ ఒక యువతి పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లయింట్ ఇవ్వడం.. ఆమెను సూర్య అతని స్నేహితులు చివరిసారిగా చూశారని చెప్పడం.. అనుమానితుడైన ఆదిత్య కూడా కనిపించకుండా పోవడం వంటి అంశాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. వీళ్లంతా ఎలా కనిపించకుండా పోయారు? డంపింగ్ యార్డ్ లో కనిపించిన శవాలెవరివి? వీటి వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.