అంతరిక్షంలోకి తెలుగు సంతతి వ్యక్తి… ఆర్నెల్ల పాటు ఐఎస్ఎస్ లో ఉండనున్న రాజాచారి

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ప్రైవేట్‌ రాకెట్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘క్రూ-3’ మిషన్‌ గురువారం విజయవంతంగా ప్రారంభమైంది. తెలంగాణ సంతతి వ్యక్తి రాజాచారి ఈ మిషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. నలుగురు వ్యోమగాములున్న క్రూ డ్రాగన్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ను ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్లింది. 22 గంటల అనంతరం రాకెట్‌ నుంచి విడిపోయిన స్పేస్‌క్రాఫ్ట్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకొన్నది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. క్రూ-3 మిషన్‌కు రాజాచారి కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు అమెరికా నేవీ సబ్‌మెరైన్‌ అధికారి కేలా బారన్‌, నాసాకు చెందిన టామ్‌ మార్ష్‌బర్న్‌ పైలట్‌గా, ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మత్తియాస్‌ మౌరర్‌ వెళ్లారు. వీరు 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. మెటీరియల్‌ సైన్స్‌, హెల్త్‌ టెక్నాలజీ, అంతరిక్షంలో మొక్కల పెంపకంపై అధ్యయనం చేయనున్నారు. వాస్తవానికి అక్టోబర్‌ 23నే ఈ ప్రయోగం జరుగాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు, వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష ప్రయాణం కావడం గమనార్హం.

2024లో జాబిల్లిపైకి..
రాజాచారి అమెరికా వైమానిక దళంలో ప్రస్తుతం కర్నల్‌ హోదాలో ఉన్నారు. 1977లో జన్మించారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ప్రాథమిక విద్య పూర్తిచేశారు. యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్‌, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. యూఎస్‌ నావల్‌ టెస్ట్‌ పైలట్‌ స్కూల్‌లో శిక్షణ పొందారు. 2017లో నాసా ఆస్ట్రోనాట్‌ క్యాండిడేట్‌ క్లాస్‌కు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా, చందమామపై అన్వేషణ కోసం నాసా చేపడుతున్న ప్రతిష్టాత్మక ‘అర్టెమిస్‌’ మిషన్‌ కోసం 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో రాజాచారి జాబిల్లిపై కాలుమోపే అవకాశం ఉంది.

హైదరాబాద్‌తో అనుబంధం
రాజాచారి తాత మహబూబ్‌నగర్‌కు చెందినవారు. తండ్రి శ్రీనివాస్‌ ఉస్మానియాలో ఇంజినీరింగ్‌ చేశారు. తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే పెగ్గీ ఎగ్బర్ట్‌ను వివాహం చేసుకొన్నారు. వీరికి 1977లో రాజాచారి జన్మించారు. రాజాచారికి భార్య హోలీ స్కాఫ్టర్‌, ముగ్గురు పిల్లలు ఉన్నారు. హైదరాబాద్‌లో తన మిత్రులు, బంధువులు ఉన్నట్టు రాజాచారి గతంలో తెలంగాణ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. టీనేజర్‌గా ఉన్నప్పుడు మిత్రులతో కలిసి ట్యాంక్‌బండ్‌పై తిరిగినట్టు పేర్కొన్నారు. రెండుమూడు సార్లు హైదరాబాద్‌కు కూడా వచ్చినట్టు తెలిపారు.

Telugu origin astronaut Rajachari explores into space