పింక్‌ టెస్టుకు సచిన్‌ మద్దతు

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి సిడ్నీ క్రికెట్‌ మైదానం(ఎస్‌సీజీ)లో జరిగే మూడో టెస్టును పింక్‌ టెస్టుగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గులాబీ బంతిని ఉపయోగించరు. ఇది కేవలం పింక్‌ టెస్టు మాత్రమే. ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌తో ఎస్‌సీజీ.. టెస్టు భాగస్వామిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్‌ టిక్కెట్ల ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రోగుల చికిత్స కోసం విరాళంగా ఇస్తుంటారు. దాంతో పాటు టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ క్రికెటర్లు తమ బ్యాగీ గ్రీన్‌ టోపీ స్థానంలో బ్యాగీ పింక్‌ టోపీలను పెట్టుకుంటారు.

రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు సహాయం చేస్తున్న మెక్‌గ్రాత్‌ ఫౌండేషన్‌కు లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన మద్దతును ప్రకటించారు. ‘రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు సహాయపడటానికి మెక్‌గ్రాత్‌ చేపట్టిన గొప్ప కార్యక్రమానికి మద్దతునిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పింక్‌ టెస్టు ద్వారా అతడు చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పది. చాలా రోజుల తర్వాత మెక్‌గ్రాత్‌ను కలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఆయన బృందానికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచిన నర్సులకు అభినందనలు’ అంటూ టెండూల్కర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా విరాళం కోసం భారత టెస్టు జెర్సీని మెక్‌గ్రాత్‌కు అందజేశాడు సచిన్‌.