ప్రకాశం బ్యారేజిపై ఉద్రిక్తత.. మందడం మహిళా రైతుల అరెస్ట్‌..

మందడం (అమరావతి) : ప్రకాశం బ్యారేజి పై రాజధాని మహిళా రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం ఉదయం నుంచి రాజధాని ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తూ పికెటింగ్‌ ఏర్పాటు చేసి మహిళలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ.. మందడంలోని మహిళా రైతులు ప్రకాశం బ్యారేజీపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి, మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దీంతో రాజధాని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని రైతులు రోడ్లపైకి వచ్చి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై ‘సేవ్‌ అమరావతి’ అంటూ నినాదాలు చేసి నిరసన చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలోకి ప్రవేశించడానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు.

ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ.. ఏడాదికి పైబడి నిరసనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈరోజు అరెస్టు చేసిన మహిళా రైతులను వెంటనే విడుదల చేయాలని, అంత వరకూ వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేశారు.