పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవ్వాలి: ఆదిమూలపు సురేశ్

ఏపీలో కరోనా భూతం తీవ్రస్థాయిలో వ్యాపిస్తుండడంతో పదో తరగతి పరీక్షలపై అనిశ్చితి ఏర్పడింది. వాస్తవానికి జూన్ 7 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఇటీవలే ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడంతో పది పరీక్షలపైనా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరణ ఇచ్చారు.

జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి టెన్త్ విద్యార్థులు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు సన్నద్ధమవ్వాలని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని, పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు నష్టం వాటిళ్లుతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.