ముఖ్యమంత్రి రైతుల ఆత్మహత్యల్ని పట్టించుకోకపోగా అవమానిస్తున్నారు

•సీఎం సొంత నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యల్ని మించి దౌర్భాగ్యం ఏముంది
•భరోసా కరవైన రైతులకు అండగా నిలిచేందుకే పవన్ కళ్యాణ్ యాత్ర
•19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 రైతు కుటుంబాలకు సాయం
•జనసేన పార్టీ పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది
•ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. జనసేనపై నమ్మకంతో ఉన్నారు
•గుంటూరు నగర జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్

జగన్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్ని పట్టించుకోకపోగా.. బాధ్యత గల స్థానంలో ఉన్నవాళ్లే ఆ రైతుల కుటుంబాలను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో 13 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి మించిన దౌర్భాగ్యం ఏముంటుందన్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులకు భరోసా కరువైన సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేమున్నాం అంటూ వారికి అండగా నిలిచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 మంది కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించబోతున్నట్టు తెలిపారు. శుక్రవారం గుంటూరులో నగర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ నగర అధ్యక్షులు శ్రీ నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో నూతన నగర కమిటీకి నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో ఇంటి పెద్దల్ని కోల్పోయిన కుటుంబాల్లో ధైర్యం నింపే విధంగా, ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. అందుకోసం అందరికంటే ముందుగా అధ్యక్షుల వారే స్వయంగా ముందుకు వచ్చి సొంత నిధుల నుంచి రూ.5 కోట్లు పార్టీకి విరాళంగా ఇచ్చారు. పర్చూరులో జరిగే రైతు భరోసా యాత్రలో ఆ జిల్లాలో సాగు కష్టాల నేపధ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన 80 మంది కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. లక్ష చొప్పున సాయం అందచేస్తారు. కొంత మంది సమాజాన్ని విచ్చిన్నం చేసే విధంగా యువతను రెచ్చగొడుతుంటే, జనసేన పార్టీ మాత్రం పది మందికీ ఉపయోగపడే విధంగా పని చేస్తుంది. శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సొంత జిల్లాలోనే 132 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిని పరామర్శించే దిక్కులేదు. వారి దగ్గరకు వెళ్లి వారిని పరామర్శించేవారు లేరు.
•జగన్ ముఖ్యమంత్రిగా పని చేసే అర్హత కోల్పోయారు
రైతుల కష్టాలు పట్టించుకోని జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసే అర్హత కోల్పోయారు. ప్రస్తుతం ప్రజలు ఒక మంచి రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజల్లో ఆదరణ, అభిమానం ఉన్నాయి. అందులో ప్రతి కార్యకర్త భాగస్వాములయ్యే విధంగా పని చేయాలి. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. గుంటూరు జిల్లాలో పార్టీకున్న బలం, పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని పని చేస్తున్న వ్యక్తులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆమోదంతో చక్కటి కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. పార్టీలో పని చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇచ్చే విధంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాం. కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం డివిజన్లు పోటీ చేయకపోయినా ఇద్దరు కార్పోరేటర్లుగా విజయం సాధించారు. ప్రజలు మనపైన నమ్మకంతో ఉన్నారు అన్నదానికి అది ఓ సంకేతం. ప్రతి డివిజన్ లో అందర్నీ కలుపుకుపోయే విధంగా కార్యవర్గం పని చేయాలి. పార్టీ నిర్మాణం సుదీర్ఘ ప్రయాణం. అది తెలుసుకుని అవగాహనతో ప్రతి ఒక్కరు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి. ఒక్కో క్రియాశీలక సభ్యుడు 100 మందిని ప్రభావితం చేసే విధంగా ముందుకు వెళ్లాలి. పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయంగా కూడా అదే విధంగా ముందుకు వెళ్లాలి. అందరినీ సమన్వయం చేసుకుని పని చేసే వారికే అసెంబ్లీ టిక్కెట్లు వస్తాయి. ప్రతి ఒక్కరు నిజాయితీగా పని చేసి పార్టీ జెండా మోయాలి. అందర్నీ కలుపుకుని వెళ్లాలి. నాయకత్వాన్ని బాధ్యతతో స్వీకరించి ముందుకు వెళ్లాలి. ఏ వ్యక్తిని పార్టీకి దూరం చేయవద్దు. పొత్తులు, సీట్ల రాజకీయాలు పక్కన పెట్టి అంతా పని చేయండి. జనసేన పార్టీకి కచ్చితంగా భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయి. వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఉంటాయి. క్రియాశీలక సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి బూత్ వద్ద నిలబడి ఎన్నికలు చేసేలా నిలబడాలి.
•నిరసనలు శాంతియుతంగా ఉండాలి
సికింద్రాబాద్ సంఘటనను జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా, బలంగా జరగాలి. అవి హింసను ప్రోత్సహించే విధంగా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు” అన్నారు.
•గుంటూరు నగరంలో జనసేన సందడి
అంతకు ముందు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బయలుదేరిన నాదెండ్ల మనోహర్ గారిని గుంటూరు నగరంలో జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ వాహనశ్రేణితో అనుసరించి సందడి చేశారు. మంగళ్ దాస్ నగర్ వద్ద కాళికామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి పార్టీ నూతన కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల సమయంలో పార్టీ గుంటూరు నగర నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కళ్యాణం శివశ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాస్, వడ్రాణం మార్కండేయబాబు, సయ్యద్ జిలానీ, నయూబ్ కమాల్, బేతపూడి విజయశేఖర్, బి.రవికాంత్, నగర, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.

Avatar