పోలవరం పునరావాస బాధ్యతను అయిదు కోట్ల ఆంధ్రులం తీసుకుందాం

• పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సెస్ ను నేను ప్రతిపాదిస్తున్నాను
• వైసీపీ చేసిన మోసాలతో పోలవరం నిషేధిత ప్రాంతమైంది
• పునరావాసానికి నిధులు కేటాయించకుండా జగన్ నాటకం
• 2027 కల్లా ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం
• శ్రీ మోదీని వ్యక్తిగతంగా కలిసి పునరావాసానికి సాయం అడుగుతాను
• జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు
• మన సొంత ఆస్తులను బలవంతంగా లాక్కునే కుట్ర
• ఉమ్మడి మ్యానిఫెస్టోకు బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి
• పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్

‘ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి కేంద్రం సుముఖంగానే ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులైన 1.6 లక్షల మందికి పునరావాసం కల్పించడం అనేది ప్రాజెక్టులో కీలకమైన విషయం. దీనికోసం సుమారు రూ. 33వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవసరం అవుతుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం తగిన మొత్తంలో భరించాలి. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలా వినియోగించుకుంది తప్పితే … ప్రాజెక్టు పూర్తికి కనీసం చొరవ చూపలేకపోయిందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ తాగు, సాగు నీరు అందించే అద్భుతమైన పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మించుకోవాలంటే మొదట ప్రాజెక్టు కోసం తమ భూములు, ఆవాసాలు త్యాగం చేసిన గిరిజనులు, గిరిజనేతరులకు తగిన న్యాయం జరగాలన్నారు. దీని కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించేలా ప్రత్యేక సెస్ ను విధించే ప్రతిపాదనను చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలంతా భావి తరాలకు అద్భుతమైన ప్రాజెక్టును అందించేందుకు వారే చొరవ తీసుకొని ప్రతి వస్తువు కొనుగోలులో ఒక పైసా చొప్పున పోలవరం ఆర్ అండ్ ఆర్ సెస్ నిధికి సొమ్ములు అందించాలన్నారు. ఇలా 6 నెలలు సెస్ నిధికి డబ్బు జమ అయితే ప్రాజెక్టును 2027 కల్లా పూర్తిస్థాయిలో నిర్మించుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 72 శాతం మేర పూర్తయ్యిందని లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన ప్రాజెక్టును పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రివర్స్ టెండరింగ్ అంటూ కొత్త విధానాల పేరు చెప్పి ప్రాజెక్టును అటకెక్కించారు. నిధులు అవసరం అయినప్పుడల్లా చిన్న చిన్న పనులు చేసుకొని బిల్లులు పెట్టుకోవడం కేంద్ర నుంచి నిధులు తెచ్చుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. అవసరానికి డబ్బు ఇచ్చే కల్పతరువులా, ఏటీఎం యంత్రంలా వైసీపీకి పోలవరం ఉపయోగపడింది తప్పితే మరే రకంగా ప్రయోజనం లేదు. ప్రజలకు సంబంధించిన అతి పెద్ద ప్రాజెక్టును, ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా మారే అద్భుత ప్రాజెక్టు నిర్మాణాన్ని వైసీపీ పూర్తి నిషేధిత ప్రాంతంగా చేసి అక్కడ ఏమీ జరుగుతుందో కూడా బయటకు వారు తెలుసుకోలేని విధంగా చేసింది. పెద్ద పెద్ద కంపెనీలు పేరుతో ప్రాజెక్టు పూర్తవుతుందని భ్రమలు కల్పించి పాలన చేసింది. ప్రాజెక్టు గురించి మంత్రులను అడిగితే వెటకారపు సమాధానాలు, వెకిలి భావాలు పలికించడం తప్ప ప్రాజెక్టు గురించి ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు.
• మన ప్రాజెక్టు నిర్మాణానికి మనమే ముందుకు కదులుదాం
వైసీపీ పాలనలో మద్యం అమ్మకాల్లో రూ. 41వేల కోట్లు, ఇసుక దోపిడీలో రూ. 45 వేల కోట్లు పక్కదారి పట్టింది. జగన్ ప్రభుత్వ అవినీతిలో వీటిలో ఒకటి మినహాయించినా పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తయ్యేది. వీరి అవినీతి పక్కన పెడితే పోలవరం ఎప్పుడో ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుతినడం తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదు. కేంద్ర పెద్దలను పోలవరం గురించి అడిగితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సంక్లిష్టత తెలియజేశారు. ప్రాజెక్టు నిర్మాణం కంటే పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయడం ప్రధానమని చెబుతున్నారు. రాష్ట్రాన్ని బంగారం చేసే ఇలాంటి ప్రాజెక్టును నిర్మించుకోవడం 5 కోట్ల ఆంధ్రుల బాధ్యతగా తీసుకుందాం. ప్రాజెక్టు ముంపులో సర్వం కోల్పోయి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసిన గిరిజనులకు అండగా నిలిచే బాధ్యతను మనం తీసుకుందాం. దీని కోసం కూటమి ప్రభుత్వంలో పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ప్రత్యేక సెస్ ను చాలా స్వల్పంగా విధించి నిధుల సమీకరణ చేయడం ఒకటే దీనికి దారి. ప్రజల వద్ద నుంచి పైసా పైసా కూడబెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ముందడుగు వేస్తాం. ఈ సెస్ నిధికి మొదటగా నేనే ముందుకు వస్తున్నాను. నా సొంత డబ్బు రూ. కోటిని మొదటగా పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సెస్ నిధికి జమ చేస్తాను. ప్రజలు కూడా దీనికి సహకరించి పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. పునరావాస ప్యాకేజీ విషయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరుతాను. శ్రీ మోదీ గారితో నాకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి తగిన సాయం అందించాలని కోరుతాను. ఆరు నెలల్లో సెస్ ద్వారా సేకరించిన సొమ్మును పునరావాసానికి వినియోగించి 2027 కల్లా పోలవరంతో పాటు అనుబంధ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తీసుకుందాం.
• తండ్రి లేని బిడ్డకు .. ఊళ్లు లేని బిడ్డల వ్యధ కనిపించలేదు
వైసీపీ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రికి నీళ్ల గురించి తెలియదు. పోలవరం ప్రాజెక్టు బతుకు వ్యధలు కనిపించవు. ఏ మనిషి అయినా అడవుల్లోకి ఎందుకు వెళ్లాలి అనుకుంటాడు.? ఈ వ్యవస్థల మీద పాలకుల మీద నమ్మకం కోల్పోయినప్పుడు ఏమీ చేయలేనని నిస్సహాయ స్థితిలో ప్రత్యామ్నాయం కోరుకుంటాడు. ప్రతి సభలోనూ తండ్రిలేని బిడ్డను అని చెప్పుకొనే జగన్ కు … పోలవరం ప్రాజెక్టు ముంపులో ఊళ్లు లేని బిడ్డలు, రోడ్డున పడ్డ బిడ్డలు కనిపించలేదా..? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గిరిజనులు చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోయారు. రూ. 33 వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడానికి ముందుకు రాని వైసీపీ ప్రభుత్వం … ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసేందుకు రూ.1300 కోట్లు , మళ్లీ వాటిని తొలగించేందుకు మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసింది. ఈ డబ్బును ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఖర్చు చేసినా కొందరికైనా న్యాయం జరిగేది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఆదాయంలో జగన్ సంపాదించింది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కంటే చాలా ఎక్కువ. ఆ సంపాదించిన సొమ్మునే ఓట్లు కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నాడు. మనం దీనిపై ఆలోచించాలి.
• ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు ఎందుకు న్యాయం చేయలేదు?
రాష్ట్రంలో ఏ ఉద్యమాలు జరిగినా వైసీపీ నాయకులు దానిలో దూరి నాశనం చేస్తారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పిన వ్యక్తికి కాపు నాయకులు మద్దతు పలుకుతారు. కాపు రిజర్వేషన్లు అనేది కేంద్రం పరిధిలో ఉందని అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదని ఇప్పుడు చెబుతున్నారు. అలా అయితే కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో 10 శాతంలో కనీసం 5 శాతం కూడా కాపులకు ఎందుకు ఇవ్వలేదు. 5 శాతం కాదు కదా.. 0.5 శాతం కూడా కాపులకు ఎందుకు ఇవ్వలేదో వైసీపీ నాయకులను ప్రశ్నించాలి. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చేది. దీనిని జగన్ కావాలనే ఆపేశాడు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొన్ని సామాజికవర్గాలకు చెందిన భూములకు నీరు అందుతుందనే అక్కసుతో ప్రాజెక్టు మొత్తం ఆపేశాడు అంటే అతడికి కొన్ని వర్గాల మీద ఇంత ద్వేషం ఎందుకో అర్ధం కాదు.
• జగన్ తాత దగ్గర నుంచి పక్కవాళ్ళ ఆస్తులు లాక్కొనే అలవాటు
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గపు చట్టం. దానిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కంటే … జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పిలవాలి. జగన్ కుటుంబంలో వాళ్ల తాతల దగ్గర నుంచి పక్క వాళ్ల ఆస్తిని లాక్కొనే అలవాటు ఉంది. జగన్ తాత కూడా వెంకట నర్సయ్య అనే వ్యక్తి దగ్గర బైరెటీస్ గనులను అక్రమంగా దోచుకున్నాడు. దోచుకోవడం అనేది జగన్ కుటుంబం డీఎన్ఏలోనే ఉంది. ఇప్పుడు తీసుకొచ్చిన జగన్ గ్రాబింగ్ యాక్ట్ లో మన ఆస్తుల మీద మనకు హక్కు ఉండదు. దున్నని ప్రతి భూమి వాళ్లదే. దున్నే ప్రతి భూమి తాకట్టుపెడతారు. ఉండని ప్రతి ఇళ్లు వాళ్లదే. ఉండే ఇళ్లను తాకట్టుపెడతారు. మెల్లగా ప్రజల ఆస్తులను కాజేస్తాడు. మన సొంత ఇళ్లు, భూమి మనదే అని అధికారుల వద్ద నిరూపించుకోవాలి. కొన్ని రోజులు ఇంట్లో, భూమిలో లేకపోయినా దానిని ఎవరైనా కబ్జా చేస్తారు. కబ్జా చేశాకా కోర్టుకు వెళ్లడానికి లేదు. జగన్ నియమించిన అధికారుల వద్దకు వెళ్లాలి. వారు ఎవరు మాట వింటారో తెలుసు. ఆస్తులకు సంబంధించి జిరాక్స్ పేపర్లు తప్ప ఒరిజనల్ పేపర్లు ఇవ్వరట. మొత్తానికి ఈ చట్టం, ఈ పాలన ఓ అరాచకం అని చెప్పాలి. మొత్తం విధ్వంసం సృష్టించారు.
• మేము సంక్షేమ దారులు వెతుకుతాం
జగన్ మేము అందిస్తామని చెప్పిన సంక్షేమ పథకాలను చూసి… అవి ఆచరణ సాధ్యం కాదని చెబుతున్నాడు. జగన్ చేసిన అవినీతి పనులను నిలువరిస్తే కచ్చితంగా ఆ డబ్బంతా ప్రజలకు చెందుతుంది. మేము అందించే సంక్షేమ పథకాలకు అది వెళ్తుంది. జగన్ దోపిడీకి దారులు వెతికితే… మేము ప్రజలకు మంచి చేయడానికి దారులు వెతుకుతాం. కూటమి తీసుకొచ్చిన మ్యానిఫెస్టోకి బీజేపీ ఆశీర్వాదం ఉంటుంది. జనసేన షణ్ముఖవ్యూహం, తెలుగుదేశం సూపర్ సిక్స్ తో కూడిన ఉమ్మడి మ్యానిఫెస్టోలో అన్ని వర్గాలకు తగిన న్యాయం చేయాలనే బలమైన సంకల్పంతో మ్యానిఫెస్టో రూపొందించాం. ఇప్పటి వరకు దేశంలోనే ఎక్కడ లేని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ బీమా తీసుకువస్తున్నాము. గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు రవాణా చేసే వారిపై గూండా యాక్ట్ ప్రయోగిస్తాం. స్థానిక సంస్థల పాలనకు స్వర్ణయుగం తీసుకొస్తాం. వారి నిధులు వారి అకౌంట్లలోనే ప్రత్యక్షంగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర బడ్జెట్ లోనూ స్థానిక సంస్థలకు 5 శాతం నిధులు కేటాయిస్తాం. చెత్త పన్ను రద్దు చేస్తాం. రేపు మే డే సందర్భంగా శ్రామికులకు నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన ఈ-శ్రమ్ కార్డును కార్మికులు తీసుకొని తగిన ప్రయోజనాలను పొందాలని కోరుతున్నాను. దీనిలో కార్మికుడికి బతుకు భద్రత ఉంటుంది. ఏదైన వైకల్యం కలిగించే ప్రమాదం జరిగితే రూ. లక్ష, పెద్ద ప్రమాదం జరిగి ప్రాణం పోతే రూ. 2 లక్షలు కార్మికుడి కుటుంబానికి ఇస్తుంది. దీంతో పాటు కార్మికుల కుటుంబానికి సైకిళ్లు, కుట్టు మిషన్లు కేంద్రం అందిస్తోంది. ఇప్పుడే నేను చెప్పినట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సెస్ కు నాతో పాటు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ పుట్టా మహేష్ యాదవ్ కూడా మరో కోటి రూపాయలు ప్రకటించారు. ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్మించి మనమంతా కలిసి రాష్ట్రాన్ని సుందరమయం చేసుకుందాం. వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టి వచ్చే ఎన్నికల్లో పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ చిర్రి బాలరాజు గారికి గాజు గ్లాస్ గుర్తుపై, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా శ్రీ పుట్టా మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను” అన్నారు.