16 మంది సైనికుల మృతి అత్యంత శోచనీయం

ఏ ప్రాణమైనా విలువైనదే. అందులో సైనికుల ప్రాణాలు మరింత విలువైనవి. అటువంటిది 16 మంది సైనికులు దేశ రక్షణ కోసం సరిహద్దులకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, మరో నలుగురు అతి తీవ్రంగా గాయపడడం మనసుని కలచి వేసిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వార్త విన్నవెంటనే గుండె భారమైంది. ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడడానికి సరిహద్దుల వద్ద నిద్రాహారాలు మాని, కుటుంబాలను దూరంగా వదిలి అనునిత్యం అప్రమత్తంగా ఉండే సైనికులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఈ రోజు ఉదయం సిక్కిం రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతమైన జేమా గ్రామం వద్ద ఆర్మీ ట్రక్కు లోయలోకి జారిపడి ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం. చురుకైన 13 మంది యువ సైనికులు, మరో ముగ్గురు జూనియర్ కమిషన్ అధికారులు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే అశువులు బాయడం దు:ఖదాయకం. తీవ్రాతి తీవ్రంగా గాయపడిన మరో నలుగురు సైనికులు దేశ ప్రజల ప్రార్ధనలతో కోలుకుంటారని ఆశిస్తున్నాను. మృతి చెందిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు సంతాపం తెలియ చేస్తున్నాను. వీర జవాన్ల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వీర మరణం పొందిన జవాన్లకు గౌరవ వందనం సమర్పిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.